CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Friday, August 22, 2014

Wednesday, August 18, 2010

అంతొద్దు! ఇది చాలు!

పుడమిని అంతా కబళించిన కడలిని కావాలని లేదు,
బీడును పులకరింపచేసే తొలకరిని అయితే చాలు.

ఖాండవ వనాన్ని దహించే దావలనాన్ని కావాలని లేదు,
కారు చీకట్లో దారి చూపగల చిరు దీపాన్ని అయితే చాలు.

లక్ష పదాల అర్ధం చెప్పగల నిఘంటువుని కావాలని లేదు,
ప్రేమ అనే మాటకి పర్యాయ పదాన్ని అయితే చాలు

పది తలల రావణడు చేసే వికటాట్టహాసం కావాలని లేదు,
పసి పాప పెదవులపై బోసి నవ్వుని అయితే చాలు.

దుఖాన్ని మాపి జ్ఞానాన్ని చూపే గీత బోధకుడిని కావాలని లేదు
సారాన్ని గ్రహించి ఇహమును గెలిచిన విజయుడను అయితే చాలు.

Sunday, May 23, 2010

వేటూరి పాట!

మాటకి పాటకి ఒక్క అక్షరమే తేడ. మాటలు అందరికి సుపరిచతమే. కాని పాట కొందరికే దేవుడిచిన వరం . పాటలలో ఉండేవి కూడా మాటలే అయినా అవి పాట స్థాయిని చేరుకోవాడికి కొన్ని అనుభూతులకి లోను అయ్యి కొన్ని కొత్త విశేషనాలని తనలో ఇముడ్చుకుంటే తప్ప మాట పాట కాలేదు .

ఒక వెదురును వేనువుగా మలిచే గోపాలుని చతురత , ఒక శిలను శిల్పంగా మార్చే ఒక శిల్పి నైపుణ్యం , ఒక వాన చినుకుని స్వాతి ముత్యంగా మార్చడానికి సంద్రానికి ఉండేంత మర్మ సంపదలాటి పదసంపద , తామరాకు పై ఒక నీటి బిందువు పొందే తదాత్మత లోని తత్వాన్ని బోధించగల ఒక తత్వజ్ఞ్యానం, పసుపక్షాదులతోను, హిమని నదాలతోను, పిల్ల తిమ్మేరలతోను కూడా సంభాషించగల దివ్య జ్ఞ్యానం ఏదో తన కృషితో , తపస్సుతో సాధించుకున్న ఒక రుషీవలుని భావజాలంలో విహరించి , రాగంతో రమించి , ఆయన కలం ద్వార ప్రసవించే ఒక మాటనే పాట అని అంటాం.


ఒక శిశువుకి ప్రాణ ప్రతిష్ట చేసే సర్వంతర్యామిని మనం దేవుడు అన్నట్టే, ఒక పాట కి అలా ప్రాణ ప్రతిష్ట చేసే వాళ్ళని గేయ రచయితా అంటాము . శతాబ్దాల గమనం గల మన సాహితీ పుణ్య నది ప్రవాహంలో తడిసి ముగ్ధులై , పరవశించి మోక్షాన్ని పొందిన సాహితీవేత్తలు, వాగ్గేయకారులు , గేయ రచయితలూ మనకి ఎందరో ఉన్నారు. సాహిత్యం లోని తీయదనాన్ని , తత్వాన్ని , సారాన్ని యా దేశ కాల మాన పరిస్థితులకి, అభిరుచులకి, అనుగుణంగా సామాన్య ప్రజానికానికి అందిస్తూనే ఉన్నారు . అలా ఎందరో మహానుభావులు . తరం మహానుభావులలో అగ్రతాంబూలానికి అర్హుడు శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారు .


వేటూరి కేవలం సినిమా వాళ్ళ మనిషా?

కానే కాదు. సినీ రచయిత కాక ముందు ఆయన ఒక పత్రికా విలేఖరి . అప్పటి ప్రధాని నెహ్రు గారిని ముఖా ముఖి Interview చేసిన ఏకీక తెలుగు పత్రికా విలేఖరి. Journalism ఆయన వృతి అయితే సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ఆయన ప్రవుత్తి. బ్రాహ్మ్మన కులంలో పుట్టి వేద అధ్యయనాల మధ్య పెరిగిన ఆయన , నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు అందరి సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవపాసన పట్టిన ఘనుడు. అర్హతను నువ్వు సాధించు , అవకాశం దేవుడే ఇస్తాడు అన్నటుగా .. ఆయన ప్రతిభ వెలుగు చూడాల్సిన తరుణం ఆసన్నం అయ్యాక , కళా తపస్వి K.Viswanath దర్శకత్వం లోని సీత కధసినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు.


సినీ రంగంలో రాణించే చాల మందికి పద ఒక Driving Force పని చేస్తూ ఉంటుంది . అది వాళ్ళుసంపాదించే డబ్బు వలన కావచు , పొందే గుర్తింపు వలన కావచ్చు , లేదా వాళ్ళు పొందే అవార్డ్లు వలన కావొచ్చు . ఇవన్ని సినిమానే ప్రపంచగా బ్రతికే వాళ్లకి స్ఫూర్తి ఇచ్చే అంశాలు . కాని సినిమాని ఒక ప్రపంచం లాగ కాకుండా కేవలం తమ తపో ఫలాలను ప్రజలకు చేరవేసే ఒక మాధ్యమంలాగా మాత్రమే ఉపయోగించుకున్న ఋషిపుంగవులు ఎందరొ ఉన్నారు . వారిలో వేటూరి ఒకరు . ఋషి అని ఎందుకు అన్నాను అంటే, తపస్సుతో ఒక అలౌకిక స్థితికి చేరుకొని , వ్యామొహాలకి పోకుండా జన హితం కోసమే తమ శక్తీ యుక్తులని ధారపోసిన వారిని ఋషులు అనే కదా అంటాం. 40 సంవత్సరాలు గేయ రచయతగా ఉన్న వేటూరి హైదరాబాద్ లో సొంత ఇంటిని నిర్మించుకోలేని ఆయన డబ్బు కోసం రాసాడని అనగలమా? శ్రీ శ్రీ తర్వాత జాతీయ అవార్డుకి ఎన్నికైన ఏకైక తెలుగు రచయత , తెలుగు భాషకి ప్రాచిన హోదా ఇవ్వలేదని , అవార్డునే తిరస్కరించిన ఈయన కీర్తి కోసం రాసాడని అంగీకరించగాలమా? అంపశయ్య మీద భీష్ముడిలా , ICU లో ఉన్నపుడు కూడా ఆయన పాట రాయటాన్నే జీవిత పరమావధిగా భావించి రాస్తూనే ఉన్నారు . అందుకే అంటున్నాను . ఆయన కేవలం సినిమా వాడు కాదు , సాహిత్యాభిలాష గల ప్రతీ తెలుగు వాడికి ఆనయ ఆత్మబంధువు.


వేణువై వచ్చాను భువనానికి ... గాలినై పోతాను గగనానికి ....


మనిషి జీవితం కష్టాల కొలిమిలో కాలి రాటు తేలినప్పుడో , లేక మృత్యువు శరవేగంతో సమీపిస్తున్నపుడో ఇలాటి వైరాగ్యం అలవాడుతుందేమో.


వేణువై వచ్చాను భువనానికి ... వెదురు వేణువుగ మారడానికి వొల్లంత గాయాలు చేసుకుంటుంది , బౌతికంగా ఒక స్థితిని పొందుతుంది . వేణువు లోంచి వచ్చిన గాలి రాగమై గగనాన్ని తాకుతుంది . రాగాలకి బౌతిక పరమైన ఉనికి లేకపోయినా అనిర్విచనీయమైన , అలోకికమైన వాటి ఉనికి ఆకాశం వరకు వ్యాపిస్తుంది . ఎన్నో బాధలకి వోర్చిన దేహం వేణువు అయితే , ఆత్మ వేణువు అనే దేహం నుండి ప్రసరించి విముక్తి పొందిన రాగం లాటిది . అది గగనానికి , ఆపై శూన్యం లోకి చేరిపోతుంది . కాని వేణువు నుండి గగనికి చేరే ప్రయాణం లో రాగాలు విని పులకించి , పరవశించిన చేట్టుచేమలు , పసుపక్షాదులు , దిక్కులు దివంగాతాలు , రాగల ఉనికికి సంగీత, సాహిత్యాలు ఉన్ననంతకాలం సజీవ సాక్షాలు. వేణువు లాటి ఆయన దేహం ఇక మనకి లేకపోవచ్చు, కానీ వేణువై ఆయన మనకందించిన గేయాలు ఎప్పటికీ మనతోటే ఉంటాయి. అన్ని కాలాలలోనూ ప్రవహించే నదిని జీవనది అంటారు. అందులో గోదావరి ఒకటి . అలాంటి గోదావరి ప్రస్తావన ఆయన చాల పాటల్లో ఉంది. ప్రతీ ప్రయోగం , ప్రతీ పోలిక , ప్రతీ వర్ణన ఒక సజీవ అనుభూతి. జీవనది లాగానే ఈయన పాటలఝారి కూడా అజరామరణం .